బ‌హు నిండు మ‌నిషి

పీవీ న‌ర‌సింహారావు గారిని గుర్తు చేసుకోవ‌డ‌మంటే వేలాది పుస్త‌కాలున్న ఒక పెద్ద‌ లైబ్ర‌రీని గుర్తుచేసుకోవ‌డ‌మే! ఆయ‌న‌తో నాకున్నది స్వ‌ల్ప ప‌రిచ‌యమే అయినా దానిని స్వ‌ల్పం అని ఎన్న‌డూ భావించ‌క‌పోవ‌డం, పాత మిత్రుడిని ప‌ల‌క‌రించిన‌ట్లే ప‌ల‌క‌రించ‌డం ఆయ‌న గొప్ప‌త‌నానికి గుర్తు. ఎమెస్కో విజ‌య‌కుమార్ గారి ద్వారా 1997లో తొలిసారి న‌ర‌సింహారావు గారిని క‌లిశాను. ఆత‌ర్వాత చాలా సంద‌ర్భాల్లో ఆయ‌న్ని క‌లిశాను. ఎప్పుడు క‌లిసినా అంత‌కుముందు రోజే మ‌నం క‌లిశాం అన్న‌ట్లుగా మాట్లాడేవారు.

నేను అనువాద సేవ‌ల రంగంలో వున్నాన‌ని తెలిసి, వ్యాపారంతో పాటు దేశ‌దేశాల సాహిత్యాన్ని తెలుగులోకి తీసుకురావ‌డంలో కూడా కాస్తంత కృషి చేయ‌మ‌ని సూచించారు. దీనివ‌ల్ల నీకు డ‌బ్బులు రావు కానీ, నీ భాష‌కు ఆమాత్రం చేయ‌డం నీ బాధ్య‌త అనేవారు. ఆయ‌న సూచ‌న‌తోనే నేను ‘హంగేరియ‌న్ క‌థ‌లు’ అనే 60 పేజీల ఒక చిన్న పుస్త‌కం ప‌బ్లిష్ చేశాను. ఐదు కాపీలు పోస్టులో పంపిస్తే, వెంట‌నే రిప్ల‌యి రాశారు. ల్యాప్‌టాప్ మీద ప‌నిచేయ‌డం ఆయ‌న‌కు మ‌హాస‌క్తి. Windows Millennium Edition మీద ప‌నిచేసే చిన్న ల్యాప్‌టాప్ వుండేదాయ‌న ద‌గ్గ‌ర‌. ఈమెయిల్ రాసినా కూడా స్వ‌యంగా జ‌వాబు రాసేవారు.

న‌ర‌సింహారావు గారు ప్ర‌ధాన‌మంత్రిగా ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత హైద‌రాబాద్ వ‌స్తే రాజ్‌భ‌వ‌న్‌లో వుండేవారు. చ‌క్ర‌పాణి గారో, వ‌సంత‌కుమార్ గారో ఆయ‌నొచ్చిన విష‌యం చెప్పేవారు. ఒక్కోసారి ఆయ‌నే ఫోన్ చేసేవారు. రాజ్‌భ‌వ‌న్‌లో ఆయ‌న ఎక్స్‌టెన్ష‌న్‌కి ఫోన్ చేస్తే ఆయ‌నే తీసేవారు. స‌హాయ‌కుల మీద పెద్ద‌గా ఆధార‌ప‌డేవారు కాదు. న‌ర‌సింహారావు గారికిస్తారా అని అడిగితే “న‌ర‌సింహారావే మాట్లాడుతున్నాడ‌య్యా” అనేవారు. ఆయ‌నకు సొంత వంట‌మ‌నిషి ఒకాయ‌న వుండేవారు. నేను వెళ్ళిన‌ప్పుడ‌ల్లా ఆయ‌న‌తో “దోస్తొచ్చిండు, అన్ని చాయ్ నీళ్ళు పోయిస్త‌వా” అని స‌ర‌దాగా అనేవారు.

పీవీ అంత్య‌క్రియ‌ల రోజు ద‌గ్గ‌ర‌గా వెళ్ళ‌డానికి అవ‌కాశం దొర‌క‌లేదు. నా జ‌న్మ‌లోనే తొలిసారి .. కొంత‌మంది జ‌ర్న‌లిస్టు మిత్రుల్ని సాయం అడిగాను. అయినా అవకాశం చిక్క‌లేదు. రాత్రి ప‌ది గంట‌ల స‌మ‌యంలో సంజీవ‌య్య పార్కు బ‌య‌ట నిల‌బ‌డి, ఆయ‌న పార్థివ దేహాన్ని ద‌హిస్తున్న మంటల్ని మాత్ర‌మే చూడ‌గ‌లిగాను. త‌ర్వాత‌రోజు ఉద‌యం ఈనాడులో వార్త .. పీవీ భౌతిక కాయం స‌గ‌మే కాలింద‌ని. అత్యంత క్లిష్ట‌మైన ప‌రిస్థితుల్లో దేశానికి ఒక దిక్కూదిశా చూపించిన రాజ‌నీతిజ్ఞుడికి ఢిల్లీలో ఎలాగూ గౌర‌వం ద‌క్క‌లేదు. ఆయ‌న సొంత గ‌డ్డ మీద కూడా ఆయ‌న‌కు అవ‌మాన‌మే ద‌క్కింది. ఆయ‌న వీట‌న్నిటికీ అతీతుడు కావ‌చ్చు; కానీ తెలుగువారంద‌రికీ ఇది స‌హించ‌రాని అవ‌మాన‌మే !

వ్యాఖ్యానించండి