Project After 10th …

నేప‌థ్యం

1999లో మొల‌కెత్తిన ఒక చిన్న ఆలోచ‌న న‌న్ను పాతికేళ్లుగా ప‌రుగులెత్తిస్తోంది. అదే “ప‌ద‌వ త‌ర‌గ‌తి త‌రువాత‌?” అనే ఒక పుస్త‌కం. టెంత్‌క్లాస్ పూర్తిచేసిన విద్యార్థుల‌కు సంప్ర‌దాయిక‌మైన కోర్సులే త‌ప్ప … కాస్త విభిన్నంగా, కొత్త త‌ర‌హా అవ‌కాశాలు లేవా? అనే ఆలోచ‌న నా మ‌న‌సులో మెదిలింది. అప్ప‌టికే అన్ని దిన‌ప‌త్రికలూ విద్య కోసం ప్ర‌త్యేక పేజీలు ముద్రిస్తున్న‌ప్ప‌టికీ, అవ‌న్నీ ప్ర‌భుత్వ ఉద్యోగాల కోసం సిద్ధ‌మ‌వుతున్న‌వారికోస‌మే త‌ప్ప, ఆ కాలంలో అందుబాటులో వున్న కొత్త త‌ర‌హా కోర్సుల గురించిన స‌మాచార‌మేదీ ల‌భించేదికాదు. అప్ప‌టికే ఇంట‌ర్‌నెట్ స‌దుపాయం అందుబాటులోకొచ్చినా, ఇంకా పూర్తిగా వ్యాప్తి లోకి రాలేదు. ఇంట‌ర్‌నెట్‌లో కూడా ప‌శ్చిమ దేశాలకు సంబంధించిన విద్య‌ల‌కు సంబంధించిన‌వే త‌ప్ప‌, భార‌త్‌లో అందుబాటులో వున్న కోర్సుల గురించిన స‌మాచారమేదీ ల‌భించ‌లేదు.

ఈ నేప‌థ్యంలో … కొంచెం ప‌రిశోధ‌న చేసి, ప‌ద‌వ త‌ర‌గ‌తి త‌రువాత పిల్ల‌ల‌కు అందుబాటులో వున్న అన్ని త‌ర‌హాల కోర్సుల గురించీ ఒక పుస్త‌కం విడుద‌ల చేద్దామ‌నే నిర్ణ‌యానికొచ్చాను. అప్ప‌టికి నేను వార్త దిన‌ప‌త్రిక‌లో స‌బ్ ఎడిట‌ర్‌గా ప‌నిచేస్తున్నాను. ఇలా ఒక చిన్న పుస్త‌కం విడుద‌ల చేస్తే బావుంటుంద‌ని మా నాన్న‌గారికి చెప్పాను. అందుకో కార‌ణ‌ముంది.

నాన్న ప్రొఫెస‌ర్ వి, సుబ్బారాయుడు స‌త్తెన‌ప‌ల్లి (ప‌ల్నాడు) ఎజికెఎం డిగ్రీ క‌ళాశాలకు ప్రిన్సిపాల్‌గా ప‌నిచేస్తున్నారు. డిగ్రీ పూర్తిచేసినవారికి పీజీ స్థాయిలో వుండే కోర్సుల వివ‌రాలు, ఉపాధి అవ‌కాశాల గురించిన అధికారిక స‌మాచారాన్ని సేక‌రించి, ఒక 60 పేజీల చిన్న పుస్త‌క‌రూపంలో రూపుదిద్దారు. ఈ త‌ర‌హా క‌ర‌దీపిక విడుద‌ల కావ‌డం బ‌హుశా దక్షిణాది లోనే ఇదే తొలిసారి. అప్ప‌ట్నుంచీ ప్ర‌తి ఏటా తాజా స‌మాచారంతో అప్‌డేట్ చేస్తూ కొన్నేళ్ల‌పాటు కొన‌సాగించారు. ఆ ప్ర‌యోగం విజ‌య‌వంత‌మైంది. అప్ప‌ట్లో దాన్ని డైరీ అనేవారు. నాన్న ఆ డైరీని ఎవ‌రైనా త‌మ విద్యాసంస్థ‌ల పేర్ల‌తో ప్ర‌చురించుకోవ‌చ్చ‌ని అనుమ‌తినిచ్చారు. దాంతో ఆంధ్ర‌, నాగార్జున విశ్వ‌విద్యాల‌యాలతోపాటు (ఉమ్మ‌డి) ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వున్న దాదాపు అన్ని యూనివ‌ర్సిటీల ప‌రిధుల్లోని ప‌లు కాలేజీలు ఈ స‌మాచారాన్ని తామూ ఉప‌యోగించుకున్నాయి. ఫ‌లితంగా డిగ్రీ చ‌దువుకున్న‌ కొన్ని ల‌క్ష‌ల మంది విద్యార్థుల‌కు అదొక క‌ర‌దీపిక‌గా మారింది.

ఈ సంఘ‌ట‌న జరిగే స‌మ‌యానికి నేను బ‌హుశా ఏడో, ఎనిమిదో త‌ర‌గ‌తిలో వుండివుంటాను. కానీ, ఆ కార్యాచ‌ర‌ణ నాకు బాగా న‌చ్చింది. పుస్త‌కం ధ‌ర రెండు రూపాయ‌లు. స‌త్తెన‌ప‌ల్లిలో త‌న కాలేజీ విద్యార్థుల కోసం నాన్న రెండొంద‌లో, మూడొంద‌ల కాపీలో ప్రింట్ చేయించారు. కాలేజీలో డిగ్రీ ఫైన‌లియ‌ర్‌ చ‌దువుతున్న విద్యార్థుల‌నే నాన్న ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, అనూహ్యంగా డిగ్రీ ఫ‌స్టియ‌ర్‌, సెకండియ‌ర్ విద్యార్థులు కూడా కొన్నారు. ఇక మా స‌త్తెన‌ప‌ల్లికి చుట్టుప‌క్క‌లున్న న‌ర్స‌రావుపేట‌, గుంటూరు, పొన్నూరు, చిల‌క‌లూరిపేట త‌దిత‌ర ప్రాంతాల్లోని కాలేజీల విద్యార్థులు కూడా ఆ డైరీ కోసం అడ‌గ‌డం మొదలుపెట్టారు. దాంతో నాన్న అలా వేరే వూర్ల నుంచి వ‌చ్చిన విద్యార్థుల‌కు ఒక పుస్త‌కాన్నిచ్చి, మీరే ప్రింట్ చేయించుకోండి అని డైరీని Free Bookగా ప్ర‌క‌టించారు. ఇక్క‌డ విశేష‌మేమిటంటే … స‌త్తెన‌ప‌ల్లిలో ల‌క్ష్మీ ప్రెస్ అనే ప్రెస్‌లో నాన్న ఈ పుస్త‌కాల్ని ప్రింట్ చేయించేవారు. ఎలాగూ ఎవ‌రైనా ప్ర‌చురించుకోవ‌చ్చ‌న్నారు కాబ‌ట్టి, చాలా కాలేజీలు అక్క‌డ‌నే ఈ పుస్త‌కాన్ని ప‌బ్లిష్ చేయించుకున్నాయి. దాంతో మా ఇంటిమీద భారం త‌గ్గింది. ఎప్పుడూ ఒక ప‌దీ ఇర‌వై కాపీలు ఇంట్లో వుండేవి. కాలేజీలో కూడా కొన్ని వుండేవి.

ప‌ద‌వ‌త‌ర‌గ‌తి త‌రువాత‌? పుస్త‌కం గురించి నేను ఆలోచిస్తున్న‌ప్పుడు పై సంఘ‌ట‌న గుర్తుకొచ్చింది. ఇలా టెంత్ త‌ర్వాత పిల్ల‌ల కోసం ఒక చిన్న పుస్త‌కం తీసుకురావాల‌నుంద‌ని చెప్పిన‌ప్పుడు … మంచి ప్ర‌య‌త్న‌మే, అవ‌స‌ర‌మైన‌దే. జాగ్ర‌త్త‌గా చేసుకో. త‌క్కువ ఖ‌ర్చులో ప్రింట్ కావాలి, త‌క్కువ ధ‌ర‌లో పిల్ల‌ల‌కు అందుబాటులో వుంచాల‌ని సూచించారు. అలా 1999 ఏప్రిల్ 1న తొలి ఎడిష‌న్‌ను విడుద‌ల చేశాను. దానికి అట్ట‌హాసం లేదు. అంటే, అట్ట (క‌వ‌ర్‌పేజీ) కూడా లేదు. 48 పేజీల చిన్న పుస్త‌కం. సెంట‌ర్ పిన్నింగ్‌. సాదాసీదా పేప‌ర్‌. ధ‌ర ప‌ది రూపాయ‌లు పెట్టాను.

ఖైర‌తాబాద్‌, అమీర్‌పేట్‌, న‌ల్ల‌కుంట‌, అశోక్‌న‌గ‌ర్‌, కాచిగూడ‌, దిల్‌సుఖ్‌న‌గ‌ర్ వంటి ముఖ్య‌మైన ప్రాంతాల్లోని కొన్నిషాపుల‌కు నేనే వెళ్లి ఇచ్చొచ్చాను. నేన‌నుకున్న‌దే నిజ‌మైంది. కేవ‌లం రెండ్రోజుల్లోనే మ‌ళ్లీ కాపీలు కావాల‌ని ఫోన్లు రావ‌డం మొద‌లైంది. వార్త ఆఫీసు ఫోన్ నెంబ‌ర్ 7644999కి వ‌చ్చే కాల్స్‌లో ఎక్కువ‌భాగం నాకే వుండేవి. అలా, ఆ తొలి ఎడిష‌న్‌నే సుమారు ఆరేడువేల కాపీలు అమ్మ‌గ‌లిగాను. అయితే, ఆర్థికంగా నాక‌ది పెద్ద‌గా ఉప‌యోగ‌ప‌డలేదు. న‌ష్ట‌మైతే ఎన్న‌డూ రాలేదుకానీ … షాపుల‌కు పుస్త‌కాలిచ్చి రావ‌డానికి వాటిని ప‌దిచోట్ల‌కు సిటీబ‌స్సుల్లో మోసుకుపోవ‌డం, తిప్ప‌ట కార‌ణంగా ఆరోగ్యం పాడైంది. అదే స‌మ‌యంలో (1999 అక్టోబ‌ర్‌)లో నేను వార్త నుంచి బ‌య‌టికొచ్చాను.

మ‌రుస‌టి సంవ‌త్స‌రం (2000) ఫిబ్ర‌వ‌రిలో పుస్త‌కం రెండో ఎడిష‌న్ విడుద‌ల చేశాను. అయితే దీనిని గ‌తంలో కాకుండా, చాలా స‌మ‌గ్రంగా రూపొందించాను. ఆత్మీయ మిత్రుడు ఎం.వి. రామిరెడ్డి త‌న తండ్రిగారి పేరిట ప్రారంభించిన మువ్వా చిన‌బాపిరెడ్డి మెమోరియ‌ల్ ట్ర‌స్టును క‌లుపుకుని 2వ (నా దృష్టిలో తొలి స‌మ‌గ్ర‌) ఎడిష‌న్‌ను విడుద‌ల చేశాం. దీనికీ అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించింది.

ఈసారి అట్ట‌హాసం త‌ప్ప‌లేదు. కంటెంట్ 96 పేజీలు వ‌చ్చింది. న‌వ్య‌ప్రింట‌ర్స్ అధినేత (దివంగ‌త‌) రామ‌కృష్ణారెడ్డి గారి ప్రెస్‌ను మిత్రుడొక‌రు సూచించారు. ఆయ‌న కూడా మంచి నాణ్య‌త‌తో, 70 జీఎస్ఎం పేప‌ర్‌, 300 జిఎస్ఎం ఆర్ట్ కార్డు మీద క‌వ‌ర్ ప్రింట్ చేసిచ్చారు. మొత్తం ప‌దివేల కాపీలు. పుస్త‌కాలు సిద్ధ‌మ‌య్యాయ‌ని తెలియ‌గానే ఒక‌రోజు మ‌ధ్యాహ్నం హిమాయ‌త్‌న‌గ‌ర్‌లో ఒక ట్ర‌క్కు మాట్లాడుకుని పుస్త‌కాలు ఇంటికి తెచ్చుకున్నాం. మా ట్ర‌క్కు ఇలా క‌దిలి హిమాయ‌త్‌న‌గ‌ర్ మెయిన్‌రోడ్డు మీదికి ఎక్క‌డం ఆల‌స్యం; పెద్ద సంఖ్య‌లో పోలీసులున్న జీపులు ప్రెస్‌ సందులోకి వెళ్లడం గ‌మ‌నించాను. పీపుల్స్‌వార్ నిషిద్ధ సాహిత్యాన్ని ప్రింట్ చేస్తున్నార‌ని ఆరోపిస్తూ, పోలీసులు న‌వ్య‌ప్రింట‌ర్స్ మీద దాడిచేశారు. కానీ, వారికి ఏ ఆధార‌మూ దొర‌క్క‌పోవ‌డంతో ప్రెస్ అంతా చెల్లాచెదురు చేసివెళ్లిపోయారు. నాకు గుండెలో ద‌డ‌పుట్టింది. నేనుగానీ, ఒక్క గంట‌గానీ లేటుగానీ చేసివుంటే నా పుస్తకాల ప‌రిస్థితేమిటో త‌ల‌చుకుని కాస్తంత గ‌ట్టిగానే భ‌య‌ప‌డ్డాను.

ఆ త‌ర్వాతి ఎడిష‌న్‌ని కూడా న‌వ్య లోనే ప్రింట్ చేశాం. ఇల్లు ఖైర‌తాబాద్‌ వెంక‌ట‌ర‌మ‌ణ కాల‌నీలో కావ‌డం, హిమాయ‌త్‌న‌గ‌ర్ దాకా వెళ్లిరావ‌డం బాగా క‌ష్ట‌మ‌నిపించింది. అదే స‌మ‌యంలో … వార్త‌లో ప్రాసెసింగ్ సెక్ష‌న్లో ప‌నిచేస్తున్న ముర‌ళి అనే ఫ్రెండ్ త‌న బంధువుల ప్రెస్ ఖైర‌తాబాద్ రైల్వేగేట్ ప‌క్క‌నే వుంద‌ని, అక్క‌డ ప్రింట్ చేయిద్దామ‌న్నాడు. అలా మూడో ఎడిష‌న్ ధ‌ర‌ణి ప్రెస్‌లో ప్రింట‌యింది. ఈసారి రామిరెడ్డి క‌ల‌వ‌లేక‌పోవ‌డంతో ఆర్థిక భారాన్ని దృష్టిలో వుంచుకుని మూడు వేల కాపీల‌కే వెళ్లాను. అదే టైమ్‌లో ముర‌ళి కూడా వార్త నుంచి బ‌య‌టికొచ్చేశాడు. ప్రెస్‌లో ఒక్క పెరుమాళ్లు గారు త‌ప్ప ఇంకెవ‌రూ నాకు తెలీదు.

ఒక‌సారి సంజీవ‌దేవ్ గారింటికి తుమ్మ‌పూడి వెళ్లొస్తూ, తెనాలి బ‌స్టాండ్‌లో గుంటూరు బ‌స్ కోసం ఎదురుచూస్తున్నాను. వార్త‌లోనే అడ్వ‌ర్ట‌యిజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో మాతో క‌లిసి ప‌నిచేసిన వెంక‌ట్ అక్క‌డ క‌లిశాడు. మాట‌ల సంద‌ర్భంలో వెంక‌ట్ తాను ఫ్రీటైమ్‌లో ప‌నిచేస్తున్న విఎస్ఎస్ లేజ‌ర్ గ్రాఫిక్స్‌కి ర‌మ్మంటూ ఫోన్ నెంబ‌రిచ్చాడు. ల‌క‌డీకాపూల్ న‌వ‌తా ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసుకు కాస్త అడ్జాసెంట్‌గా వుంటుంది. ఒక‌రోజు వెళ్లి వెంక‌ట్‌ని క‌లిశాను. వెంక‌టేశ్వ‌ర‌రావు గార‌ని ఆ సంస్థ ప్రొప్ర‌యిట‌ర్ … వారితో మాట్లాడించాడు. నేనూ అప్ప‌టిదాకా జ‌రిగిందంతా చెప్పాను.

నేను ఈ పుస్త‌కం ద్వారా పెద్ద‌గా డ‌బ్బేమీ ఆశించ‌డం లేద‌ని, ప్రింట్ ఖర్చులు, నా ఆథ‌ర్ రెమ్యూన‌రేష‌న్ వ‌స్తే చాల‌నుకుంటున్నాన‌ని కూడా చెప్పాను. అలా విఎస్ఎస్ లేజ‌ర్ గ్రాఫిక్స్‌తో బంధం మొద‌లైంది. అనంత‌ర‌కాలంలో ప్రెస్‌ ఖైర‌తాబాద్ ద‌క్షిణ భార‌త హిందీ ప్ర‌చార‌స‌భ కాంప్లెక్స్‌కి మారింది. అదే ఆత‌ర్వాత సాయిలిఖిత ప్రింట‌ర్స్ అయింది. ఈ ప్రెస్ నాకు ఇంకోవిధంగా కూడా ప్ల‌స్ అయింది. మా ఇంటినుంచి మెయిన్‌రోడ్డు త‌గ‌ల‌కుండా చింత‌ల్‌బ‌స్తీ నుంచి నేరుగా వెళ్లిపోవ‌చ్చు.

అప్ప‌ట్నుంచీ ఈ 25వ ఎడిష‌న్ దాకా మ‌రో ప్రెస్‌కి వెళ్ల‌లేదు. నా పుస్త‌కాల‌న్నీ ఇక్క‌డే ప‌బ్లిష్ అయ్యాయి. న‌వ్య రామ‌కృష్ణారెడ్డి గారెలా ఈ ప్రాజెక్టుకు స‌హ‌కారం అందించారో, అదే స‌హ‌కారాన్ని వెంక‌టేశ్వ‌ర‌రావు గారూ అందిస్తూవ‌స్తున్నారు. ఆయ‌నే ఇప్పుడు రైతునేస్తం వెంక‌టేశ్వ‌ర‌రావుగా విస్తృత‌ ప్రాచుర్యంలోకి వ‌చ్చారు. ఈ ప్రెస్‌లో నాకు తెలియ‌నివాళ్లూ, నేను తెలియ‌నివాళ్లూ ఎవ‌రూలేరు. అన్ని డిపార్ట్‌మెంట్ల ఉద్యోగులు చాలా స‌న్నిహితంగా వుంటారు.

ఇక కంటెంట్ విష‌యానికొస్తే … ప‌ద‌వ త‌ర‌గ‌తి త‌రువాత‌? పుస్త‌కాన్ని ప్ర‌తి ఏటా న‌వ్య‌రీతిలో తీసుకువ‌స్తున్నాం. ప్ర‌తి ఏటా అందుబాటులోకి వ‌స్తున్న తాజా కోర్సులు, అవి ఎక్క‌డెక్క‌డ అందుబాటులో వున్నాయి, వాటిని ఎలా ఎంచుకోవాలి, కుటుంబ‌స‌భ్యుల బాధ్య‌తలు … ఇలా వంద‌లాది అంశాల‌ను స‌మ‌గ్రంగా వివ‌రిస్తూ పుస్త‌కం రిలీజ్ చేస్తూవస్తున్నాను.

ఇప్పుడు సిద్ధ‌మ‌వుతున్న 25వ (సిల్వ‌ర్ జూబిలీ) పుస్త‌కం 200 పేజీల‌తో మ‌రింత స‌మ‌గ్రంగా విడుద‌ల‌కానుంది. ఈ ఎడిష‌న్‌కి కొన్ని ప్ర‌త్యేక‌త‌లున్నాయి.ఇందులో సంప్ర‌దాయిక కోర్సుల వివ‌రాల కంటే ముందే … స‌త్వ‌ర ఉపాధి కోర్సుల గురించిన స‌మాచారాన్నే ప్రాధాన్యంగా తీసుకున్నాం. ఇందుకు కారణం – క‌రోనా అనంత‌ర కాలంలో ఏర్ప‌డిన ప‌లు అనివార్య ప‌రిస్థితులు. దేశంలో ఎన్న‌డూ లేని విధంగా 2020 నుంచీ విద్యార్థుల్లో ఎక్కువ‌మంది … స్వ‌ల్ప‌కాలిక కోర్సులు పూర్తిచేసి స‌త్వ‌ర ఉపాధి పొంద‌డానికే మొగ్గు చూపుతున్నారు. ఫ‌లితంగా ఈ త‌ర‌హా కోర్సుల‌కు డిమాండ్ బాగా పెరిగింది. ఐటీఐ అంటే ఆ… అని పెద‌వి విరిచిన మ‌ధ్య‌, దిగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి త‌ల్లిదండ్రుల్లో కూడా ఆశావ‌హ‌మైన మార్పు క‌నిపిస్తోంది.

ఇంట‌ర్మీడియ‌ట్ కావాలంటే ఒకేష‌న‌ల్‌లో చ‌దువుకుందాం. డిగ్రీ కావాలంటే డిస్టెన్స్‌లో చ‌దువుకుందాం. ముంద‌యితే ఏదో ఒక ఉపాధి క‌ల్ప‌న కోర్సును పూర్తిచేసి, పిల్ల‌లు త‌మ కాళ్ల‌మీద తాము నిల‌బ‌డేలా చేద్దాం అనే పాజిటివ్ ధోర‌ణి త‌ల్లిదండ్రుల‌లో కూడా పెరుగుతోంది. పశ్చిమ దేశాల్లో ఇది స‌ర్వ‌సాధార‌ణం. కానీ, మ‌న దేశంలో ఇది కొత్త ప‌రిణామం. ఆహ్వానించ‌ద‌గ్గ ప‌రిణామం కూడా! ఈ ప‌రిణామాల‌ను దృష్టిలో వుంచుకుని కొత్త ఎడిష‌న్‌ను టెంత్ త‌ర్వాత‌ ఉపాధి అవ‌కాశాల‌ను ప్రాధాన్యంగా తీసుకున్నాం.

25వ ఎడిష‌న్‌ను లిమిటెడ్ ఎడిష‌న్‌గా కేవ‌లం 500 కాపీలు మాత్ర‌మే ప్రింట్ చేయ‌బోతున్నాం. హైద‌రాబాద్‌, విజ‌య‌వాడ బుక్‌ఫెయిర్ల స‌మ‌యానికి ప‌రిస్థితుల్నిబ‌ట్టి రీప్రింట్‌కి వెళ‌తాం.

ఇదీ ప‌ద‌వ త‌ర‌గ‌తి త‌రువాత‌? పుస్త‌కానికి సంబంధించిన న‌డిచిన చ‌రిత్ర‌.

గ‌త 24 ఎడిష‌న్లను విద్యార్థులు, త‌ల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యారంగంలో ప‌నిచేస్తున్న వేలాదిమంది బ‌హుముఖంగా ప్ర‌శంసించారు. మాజీ రాష్ట్రప‌తి ప్రొఫెస‌ర్ అబ్దుల్ క‌లామ్ ఈ పుస్త‌కం తిర‌గేశారు. ఆ పుస్త‌కానికి సంబంధించిన వివ‌రాల్ని ఆయ‌న‌కి ఇంగ్లీష్‌లో చెప్పాను. ఆయ‌న నా భుజం త‌డుతూ అన్న రెండు వాక్యాల్ని పుస్త‌కం క‌వ‌ర్‌పేజీ మీద ఆయ‌న చిన్న ఫొటోతోపాటు ముద్రించాను.

ప‌ద‌వ త‌ర‌గ‌తి త‌రువాత‌? పుస్త‌కం తాజా ఎడిష‌న్ ధ‌ర రు. 550. పోస్టులో అయితే రు. 50 అద‌నం. 9849970455 (VMRG INTERNATIONAL) నెంబ‌రుకు ఏ బ్యాంకు యూపీఐ ద్వారానైనా చెల్లించి, ఆ స్క్రీన్‌షాట్‌ను ఇదే నెంబ‌ర్‌కి వాట్స‌ప్ ద్వారా పంపండి. అక్క‌డే మీ పూర్తి చిరునామాను తెలియ‌జేయండి. ఆగ‌స్ట్ చివ‌రి వారంలో పుస్త‌కం విడుద‌ల‌వుతుంది.

ప్రీపే ఆర్డ‌ర్ ద్వారా అడ్వాన్స్ చెల్లించిన‌వారికి పోస్ట‌ల్ చార్జీలు (రు.50) వుండ‌వు. ఈ అవ‌కాశం జులై 20వ తేదీ వ‌ర‌కూ వ‌ర్తిస్తుంది.

విద్యాసంస్థ‌లకు పుస్త‌కం ధ‌ర రూ.400 మాత్ర‌మే. విద్యాసంస్థ లెట‌ర్‌హెడ్ మీద రిక్వెస్ట్ లెట‌ర్ పెట్టాలి. దీనిని స్కాన్ చేసి వాట్స‌ప్ ద్వారా పంపాలి. మినిమ‌మ్ ఆర్డ‌ర్ 30 కాపీలు.

ధ‌న్య‌వాదాలు.

  • సురేశ్ వెలుగూరి

For more info / assistance, please call 9849970455.

చిన్న‌న్న‌య్యా, అయామ్ వెరీ వెరీ సారీ !!

Oct 24, 2017

ఇవ్వాళ మ‌ధ్యాహ్నం మా చిన్న‌న్న‌య్య ఇంటికొచ్చాడు. నేను లోప‌లి గ‌దిలో కంప్యూట‌ర్ మీద నా ప‌ని నేను చేసుకుంటూవున్నా. సురేషూ అని న‌న్ను పిలిచేవుంటాడు కానీ, నాకు వినిపించ‌లేదు.

స‌రే, సొంత త‌మ్ముడిల్లే క‌దా అని స్వేచ్ఛ‌గా కిచెన్ లోకి వెళ్లి ఓ రెండు అర‌టిప‌ళ్లు తిన్నాడు. ఇంకో రెండు ప‌ళ్లు కూడా తిన‌డానికి ట్రై చేశాడు కానీ, మ‌రీ గ‌ట్టిగా వున్నాయేమో, వాటిని మెత్త‌గా పిసికి కింద ప‌డేశాడు. ప‌క్క‌నే డ‌బ్బాలో మొన్న‌నే ప్ర‌గ‌తిన‌గ‌ర్ సూప‌ర్‌మార్కెట్లో కొనుక్కొచ్చిన సుప్ర‌శ‌స్త‌మైన బూందీ, చేగోడీలున్నాయి. అవి క‌నిపించ‌లేద‌నుకుంటా … క‌నీసం ప‌చ్చిశ‌న‌గ‌లైనా తిందామ‌ని చూశాడు. డ‌బ్బా చేతిలోకి తీసుకుని హాల్లోకొచ్చాడు. బ‌హుశా మ‌ళ్లీ న‌న్ను పిలిచేవుంటాడు, నేను ప‌లికివుండ‌ను. కోప‌మొచ్చిన‌ట్లుంది, డ‌బ్బాను బాల్క‌నీలో విసిరికొట్టి వెళ్లిపోయాడు. త‌ర్వాతెప్పుడో నేను బ‌య‌టికొచ్చి … అయ్యో, చిన్న‌న్న‌య్య వ‌చ్చిన విష‌యం గ‌మ‌నించ‌లేదే అని చాలా బాధ‌ప‌డ్డాను.

చిన్న‌న్న‌య్యా, అయామ్ వెరీ వెరీ సారీ. ఏమీ అనుకోకు. ఇంకోసారి ఇలా చేయ‌ను. న‌న్ను క్ష‌మించి ఈ పోస్టు చ‌ద‌వ‌గానే మ‌నింటికొచ్చెయ్‌. ఫ్రెండ్స్‌, మా చిన్న‌న్న‌య్య మీలో ఎవ‌రికైనా క‌నిపిస్తే ద‌య‌చేసి నాకు ఇన్‌ఫ‌ర్మేష‌న్ ఇవ్వండి. మీ ఆన‌వాలు కోసం మా చిన్న‌న్న‌య్య ఫొటో కింద లింక్‌లో పెడుతున్నాను. https://goo.gl/3zTqh2