పుట‌క నీది, చావు నీది, బ‌తుకంతా దేశానిది … కాళోజీ

Sep 09, 2015

కాళోజీ ప‌లానా రోజున పుట్టాడు, ప‌లానా రోజున ఇది చెప్పాడు, ప‌లానా రోజున పోయాడు … ఈ చ‌రిత్ర‌లు, ద‌స్తావేజులు ఇక అవ‌స‌రం లేదు. అవ‌న్నీ వికీపీడియాకి వ‌దిలేద్దాం. ఆయ‌న చెప్పిన స‌త్యం నుంచి జీవితాన్ని అర్థం చేసుకోవ‌డానికి మాత్రం ప్ర‌య‌త్నిద్దాం. భూమ్మీద వుండ‌గా ఆయ‌న ఏం చెప్పాడు, దానిని ఎలా ఆచ‌రించి చూపించాడు అన్నంత‌వ‌ర‌కూ చూస్తే చాలు.

కాళోజీ మేధావుల మాదిరి అర్థం కాని భాష మాట్లాడ‌లేదు. భాష‌ను గుర్రాన్ని ఆడించినట్లు ఆడించ‌లేదు. స‌కిలింపులు, వెకిలింపుల్లేవు. ఒక సాదాసీదా మ‌నిషి మ‌నింట్లో న‌వారుమంచం మీద కూర్చుని మాట్లాడే జ‌న‌జీవిత భాష‌ను ఎంతో సొంపుగా మాట్లాడాడు. లోప‌ల గ‌ర‌ళాన్నీ, బ‌య‌టికి అమృతాన్నీ మాట్లాడ‌లేదు. స‌త్య‌దీక్షతో మాట్లాడాడు.

కాళోజీ గుర్తొస్తే చ‌ప్పున గుర్తొచ్చే వాక్యం “పుట‌క నీది, చావు నీది, బ‌తుకంతా దేశానిది”. ఇదొక్క‌టి చాలు కాళోజీని ద‌ర్శించుకోవ‌డానికి. మ‌న ఘోష‌ని మ‌నం భాష‌లో మ‌నం చెప్పుకోవ‌డం క‌న్నా ఆయ‌నకిచ్చే ఘ‌న నివాళి ఇంకొక‌టి లేదు.

చాలా ఏళ్ల క్రితం వ‌డ్డెర చండీదాస్ గారిని (ఒకేఒక్క‌సారి) క‌లిశాను. ఆయ‌న ద‌గ్గ‌ర కూర్చున్న 45 నిముషాల్లో 15 నిముషాలు కాళోజీ గురించి, ఇంకో ప‌ది నిముషాలు ఆళ్వారుస్వామి గురించి మాట్లాడారు. “ఆయ‌న‌ది కాళోజీ భాష” అన్నారు. ‘నా గొడ‌వ‌’లో కాళోజీ కూడా అదే క‌దా అన్న‌ది !!

ర‌చ‌యిత‌ల‌కు ప్రాంతం, దేశం ప‌రిధులెక్క‌డివి? ఆంధ్ర ప్రాంతంలో కూడా కాళోజీకి నివాళి స‌భ‌లు జ‌ర‌గ‌డం ఈ స‌త్యాన్ని రుజువుచేస్తోంది.

వ్యాఖ్యానించండి