Telugu will never die

Sep 27, 2015

కొన్ని వారాలుగా కొత్త‌త‌రం తెలుగు ఉద్యోగులు “వ‌ర్క్‌ప్లేస్‌లో నిల‌క‌డ‌గా గెల‌వ‌డానికి ఉప‌యోగ‌ప‌డే” అంశాల‌ను రాస్తూవ‌స్తున్నాను. హైద‌రాబాద్ లోని ఒక మ‌ల్టీనేష‌న‌ల్ కంపెనీ ప్ర‌తినిధి ఒకాయ‌న అడిగారు – “ఎందుకు తెలుగులోనే రాస్తున్నారు? ఇంగ్లీష్‌లో రాస్తే ఇంకా ఎక్కువ‌మందికి చేరే అవ‌కాశం వుంటుంది క‌దా” అని. ప్ర‌శ్న చాలా చిన్న‌దే కానీ, స‌మాధానం మాత్రం లోతుగా చెప్పాల్సివ‌చ్చింది.

ఇంట‌ర్‌నెట్ సౌల‌భ్యం వ‌ల్ల ఈరోజు ఏ అంశం మీదైనా ఇంగ్లీష్‌లో చాలా స‌మాచారం అందుబాటులో వుంది. కాస్తంత వెతుక్కోగ‌లిగితే చాలు. కానీ, తెలుగు లాంటి ప్రాంతీయ భాష‌ల‌కు అంత సౌల‌భ్యం లేదు. ఈరోజు ఉద్యోగావ‌కాశాల్లోకి వెళ్తున్న తెలుగు యువ‌తీయువ‌కుల‌కు ఇంగ్లీష్ భాష మీద చాలా భ‌యం వుంది. ఇంగ్లీష్ మీడియంలో చ‌దువుకున్న‌ప్ప‌టికీ, నూటికి 90 శాతం మంది తెలుగును స్ప‌ష్టంగా చ‌ద‌వ‌గ‌ల‌రు. వారికి ఇంగ్లీష్ కంటే తెలుగులో రాసిందే బాగా అర్థ‌మ‌వుతుంది. కాబ‌ట్టి, సాధ్య‌మైనంత‌వ‌ర‌కూ నేను తెలుగులో రాయ‌డానికే ఇష్ట‌ప‌డ‌తాన‌ని ఆ మిత్రుడికి చెప్పాను. ఇంట‌ర్‌నెట్ ద్వారా ఇంగ్లీష్ నుంచి కొంత స‌మాచారం తీసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రే అయినా, వ్య‌క్తిగ‌త అనుభ‌వాలు, ప‌డిక‌ట్టు ఆధారంగా స‌హ‌జంగా తెలుగులో రాయ‌డ‌మే సుఖ‌మ‌నిపిస్తుంది నాకు.

మెకాలే ఏ ఉద్దేశాల‌తో ఇంగ్లీష్‌ను మ‌న‌మీద రుద్దాల‌ని చూసినా, ప్రాంతీయ భాష‌ల మీద‌ మ‌న కుటుంబాలకున్న ఆపేక్ష‌, ఇంట్లో త‌మ సొంత భాష‌ను మాత్ర‌మే మాట్లాడాల‌నే స్వీయ‌నిబంధ‌న‌ల వ‌ల్లనే మ‌న‌మింకా తెలుగును అంటిపెట్టుకుని వుండ‌గ‌లిగాం.

తెలుగు చ‌చ్చిపోవ‌డానికి ఇంకెంతో కాలం ప‌ట్ట‌ద‌ని ఆమ‌ధ్య ఒక పెద్దాయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేస్తే, అందుకు ఆస్కార‌మే లేద‌ని చెప్పాను. ఇవ్వాళ ఐటీ, ఇత‌ర అన్ని రంగాల్లో ప‌నిచేస్తూ, తెలుగులో సుస్ప‌ష్టంగా రాస్తున్న‌వారు వేలల్లో వున్నారు. వేలాది బ్లాగులే అందుకు సాక్ష్యం. కాబ‌ట్టి, భ‌యాల‌క్క‌ర్లేదు. తెలుగు ఎప్ప‌టికీ చావ‌దు.

వ్యాఖ్యానించండి